Online Puja Services

అయోధ్యరాముని ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకమే !

3.136.18.48

అయోధ్యరాముని ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకమే ! | Everything is special in Ayodhya Rama Mandir
లక్ష్మీ రమణ 

రామాయణమంటే కేవలం ఒక కావ్యం కాదు.  అది మనిషిగా మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పిన రాముని మార్గనిర్దేశనం. అనంత గుణశీలుడైన సాకేత రాముడు భారతీయుల అంతరంగధాముడు. సర్వ సుగుణ, లక్షణ లక్షితుడు.  ఏకపత్నీ వ్రతుడు.  ప్రజారంజకమైన పరిపాలకుడు.  ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయ ఆత్మ శ్రీరామచంద్ర మహాప్రభువు.  అటువంటి రామునికి, ఆయన జన్మించిన భూమి అయోధ్యలో మందిరాన్ని నిర్మించడం నిన్నటివరకూ ఒక కల. కానీ ఈరోజాది ఫలించిన స్వప్నం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామబంధువులకి, భక్తులకి ఇంతకుమించిన ఆనంద తరుణం, దివ్యమైన సమయం మరొకటి లేదు. అందుకే ఆ రాముని మందిరాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ తో పాటు విశ్వవ్యాప్త రామ భక్తులూ కలిసి నిర్మించుకుంటున్నారు. ఈ భవ్యాలయ నిర్మాణంలో మట్టి నుండీ, రాముని ప్రతిమ వరకూ ప్రతిదీ ప్రత్యేకమే !

ఆలయ రూపం ఇలా : 

వేద పురుషుడు శ్రీరాముడు. ఆ పరమ పురుషుని ఆలయ నిర్మాణం కోసం మందిరం డిజైన్‌ను ఆలయాల రూపకర్తలుగా పేరొందిన సొంపుర కుటుంబం రూపొందించింది.  ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 ఆలయాలను రూపొందించారు. 15 తరాలుగా ఆలయాలని రూపొందించే కళలో ఆరితేరిన స్థపతులు ఈ కుటుంబంలో జన్మించడం వీరి జన్మ జన్మల సుకృతం. సుప్రసిద్ధ సోమనాథ ఆలయం కూడా వీరి చాతుర్య కళతోనే కొత్త సొబగులు దిద్దుకుంది. వీటితోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దివ్యమైన ఆలయాలకు రూపకర్తలు సోంపురా కుటుంబీకులు. 

 ఆలయాల వాస్తు శిల్ప కోవిదుడు చంద్రకాంత్ సోంపురా, ఆయన కుమారులు ఆశిష్, నిఖిల్ తోడుగా  ఈ భవ్య ఆధ్యాత్మిక నిర్మాణ రూపకల్పన కోసం పనిచేశారు. ఆలయాన్ని పరంపరాగతమైన చాళుక్యుల కాలంనాటి పురాతనమైన విశిష్ట భారతీయ సంప్రదాయ నాగర శైలిలో రూపొందించడం విశేషం.  

నీరు, మట్టి కూడా ప్రత్యేకమే : 

శ్రీరాముడు జగదానంద కారకుడు.  అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించడం అంటే, ఆధ్యాత్మికోన్నత దివ్య కమలంలో పరమాత్మని ప్రతిష్టించడం వంటిది.  తపోధనులకి తప్ప సాధ్యం కానీ ఆ శిఖరం పైన ప్రతిష్ఠితుడైన జగదభిరాముని దర్శనం సామాన్యులకి లభించడం దుర్లభమే ! అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఈ శుభతరుణంలో పంచభూతాలూ కూడా రామ సేవకే అంకితమైనట్టు కనిపిస్తున్నాయి. 

అయోధ్య రామాలయంలో వాడే నీరు, మట్టి, ఇటుక, రాయి కూడా ప్రత్యేకమైనవే. పునాది నుండీ పరంధాముని మందిరం దాకా ప్రతిదీ  ప్రత్యేకమే ! ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు.  థాయిలాండ్ నుండీ కూడా మట్టిని రప్పించారు.  ఝాన్సి, బిథూరి, యమునోత్రి, హల్దీఘటి, ఛత్తోరోర్ఘడ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఇది ఆధ్యాత్మిక ఏకత్వాన్ని సాధించడానికి ఉపయోగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.  

ఇక, గంగ, యమున, గోదావరి ,  కావేరి, కృష్ణ తదిర నదులన్నింటిలోని పవిత్రజలాలనీ రామ పట్టాభిషేకం కోసం తెప్పించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా దాదాపు 150 ప్రాంతాల నుండీ తెప్పించిన పవిత్ర జలాలని శంఖుస్థాపన సమయంలో వినియోగించారు.

కాంక్రీటు లేని నిర్మాణం -ప్రత్యేకమైన ఇటుకలు : 

 ఇక మందిర నిర్మాణంలో వినియోగించే ఇటుకలు కూడా అత్యంత ప్రత్యేకమే. రాముని కన్నా గొప్పవాడు రాముడే! అందుకే రామనామం మహా శక్తివంతం.  ఆ రామ నామం రాసిన రాళ్లు సముద్రాన్ని జయించి వానరసేనకి వారధిగా మారాయి.  అటువంటి శక్తివంతమైన శ్రీరామ నామం రాసిన ఇటుకలు రామమందిర నిర్మాణానికి వాడుతున్నారు.   

ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. ఈ రాళ్లన్ని బన్సీ పహర్‌పూర్ నుండీ ప్రత్యేకంగా తెప్పించారు. రాళ్ళ మధ్యలో వచ్చే ఖాళీలని రామనామాంకితాలైన ఇటుకలతో పూరించారు. అత్యంత మన్నికతో శాస్త్రీయంగా తయారు చేసిన ఇటుకలను నిర్మాణానికి వినియోగించారు . ఈ ఇటుకలను తయారు చేసేందుకు చండీగఢ్ కంపెనీకి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రామనామం ఇటుకలు అయోధ్యకు చేరుకున్నాయి. రామజన్మభూమి ఆలయం లోపల రెండు రాళ్ల మధ్య అంతరంలో ఈ ఇటుకలను ఏర్పాటు చేశారు. ఇటుకలన్నీ నాణ్యతను పరిశీలించిన తర్వాతే అమర్చడం జరిగిది . ఈ ఇటుకలతో ర్యాంపులు తయారు చేయడంతో పాటు,  మెట్లకు కూడా ఇటుకలను వినియోగించారు. 

శ్రీరామ నామం రాసిన ఇటుకలు ప్రత్యేకమనుకుంటే, మూడు రంధ్రాలతో కూడిన ఇటుకలని వినియోగించడం మరింత విశేషంగా మారింది. కాంక్రీటు లేని ఈ నిర్మాణంలో ఈ ఇటుకలు  రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి లాటిస్‌గా పనిచేస్తాయి.ఇటువంటి నాణ్యతలో రాజీలేని పరంపరాగత సంప్రదాయ విశిష్ట భారతీయ నిర్మాణ శైలి  వలన మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమత్తులు అవసరం ఉండకపోవచ్చని నిపుణుల అంచనా!

మూడంతస్థుల ఆలయం : 

అయోధ్య రాముని ఆలయం మొత్తంగా  మూడు అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు.

రామమందిరం మొదటి అంతస్థు 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది.ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. ఇక్కడే బాలరాముడు సర్వాంగ సుందరంగా, భక్త వరదుడై కొలువుతీరారు.  ఇక,  మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. దాంతో పాటు, శ్రీ రామ చంద్రుడు సీతా లక్ష్మణ హనుమ సమేతుడై పట్టాభిరామునిగా ఇక్కడ కొలువయ్యారు. ఈ  మందిర నిర్మాణానికి భరత్ పూర్ నుంచి గులాబి రంగు రాతిని,  బన్సీపహార్ పూర్ నుండీ ఇసుకరాతిని తెప్పించి వివినయోగించారు. 

భాగ్యనగర పనితనంతో రామయ్యకి బంగారు తలుపులు: 

అయోధ్య రామాలయ నిర్మాణం అనుకోగానే, యాదాద్రితో పాటు అనేక దేవాలయాలకి తలుపులు రూపొందించిన అనూరాధా టింబర్ డిపో ఇంటర్నేషనల్, హైదరాబాద్ వారి సేవలు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర సంస్థాన్ వారి దృష్టిని ఆకర్షించాయి. మొట్టమొదట ఆలయ స్థపతులైన సోంపురా వాస్తుశిల్పాచార్యుల నిర్దేశకత్వాల ప్రకారం కలపతో బృహత్తర రామ మందిర నిర్మాణ నమూనాని తయారుచేసి ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు బంగారు పూతతో కూడిన మొత్తం  18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా, తీర్చి దిద్దారు. ప్రత్యేకంగా అయోధ్యలోని రామాలయం దగ్గరలోనే ఒక విభాగాన్ని నెలకొల్పి మరీ శ్రేష్ఠమైన బలార్షా టేకుతో ఈ తలుపులని మలచడం విశేషం.  

వాడవాడలా పూజందుకొని అయోధ్య చేరిన రామపాదుకలు : 

తలపుల నిండా శ్రీ రాముడే నిండిన వేళ,  తలుపులతో పాటు శ్రీరాముని పాదుకలు కూడా భాగ్యనగరం రూపొందించి అందించడం తెలుగువారి సౌభాగ్యం. సాకేత రామునికి  రెండు జతల బంగారు తాపడం చేసిన  పాదుకలు ‘అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్‌’ అందిస్తున్నది. ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శ్రీ చల్లా శ్రీనివాస్‌ శాస్త్రి  ఒక జత పంచలోహాలతోనూ, మరో జత వెండితోనూ రూపొందించి వాటి పైన బంగారు తాపడంతో అద్భుతంగా తయారు చేయించారు.  పాత బోయిన్‌పల్లిలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్‌ కళాకుటీర్‌లో శిల్పి శ్రీ రామలింగాచారి వీటికి సశాస్త్రీయంగా రూపకల్పన చేశారు.  ఈ పాదుకలని  శ్రీ చల్లా శ్రీనివాస్‌ శాస్త్రి తలపై మోస్తూ, పాదయాత్రగా, రాముడు అరణ్యవాసంలో నడిచిన దారివెంట అయోధ్యకు చేరుకున్నారు. దారిలోని పుణ్యతీర్థాలలో, దివ్య స్థానాలలో ఆ పాదుకలు పూజలందుకున్నాయి. మఠాధిపతుల ప్రత్యేక నీరాజనాలని స్వీకరించాయి. పూర్ణకుంభ స్వాగతాలని, అశేషమైన రామ భక్తుల అర్చనలని, వందనాలని అందుకొని అయోధ్యకి చేరుకున్నాయి.  

శ్రీరాముని యంత్రం : 

రామజన్మభూమిలో కొలువైన శ్రీ రాముని మూలమూర్తి  కింద ప్రతిష్టించిన యంత్రం ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో శుద్ధమైన బంగారంతో రూపొందింది. హనుమంతుని మహాభక్తులు, శ్రీరాముని పాదసేవకులు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి గారు చీరాల వాస్తవ్యులు. ఆ హనుమంతుని ఆదేశమో, ఆ చిదంబరుని అనుగ్రహమో గానీ 14 వేల జపధారతో  అయోధ్య శ్రీ రాముని పుత్తడి యంత్రాన్ని పరిపుష్టం చేసే భాగ్యం బ్రహ్మశ్రీ  అన్నదానం చిదంబరశాస్త్రి గారికి దక్కింది.  ఇటువంటి మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు.  ఆ శ్రీ రాముని దివ్య కరుణాకటాక్షం ఉంటె తప్ప ఇటువంటి బృహదకార్యం సాధించడం, అందుకు అవకాశం సైతం దక్కడం దుర్లభమేకదా !

శ్రీ రాముని జెండా: 

రామ నామమే విజయానికి మారు పేరు.  శ్రీ రాముని మందిరంపైన నెలకొనబోయే జండా శ్రీ రామ చరితని, శ్రీ రామ విజయాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జారీ చంపత్ రాయ్ సూచనలమేరకు  మధ్యప్రదేశ్‌, రేవాలోని  హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా ఈ జెండాని తయారుచేశారు . జెండా పైన , సూర్యవంశజుడైన రాముని మూలపురుషుని ప్రతిబంబిస్తూ  ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై శ్రీ రామ్ నినాదం,  పక్కనే దేవ కాంచన చెట్టు  చిహ్నాన్ని ముద్రించనున్నారు.ఈ దేవకాంచనం అయోధ్య రాజ్యా వృక్షంగా ఉండేదట. దాదాపు 13 అడుగుల ఎత్తున, శ్రీరాముని ఆలయ శిఖరంపైన ఈ జెండా ఠీవిగా నిలబడింది. 

రాముని నామం దివ్యమైనది.  మననం చేసేకొద్దీ మరింత మధురమై, మధువు కోసం ఆకర్షించబడే  తుమ్మెదల్లాగా,మనసుని ఆకర్షిస్తుంది.  మోక్షాన్ని ప్రసాదిస్తుంది.  ఎంతగా రామ నామం చెప్పినా తనివి తీరనంత తీయనిది ఆ నామ మహిమ.  అలాగే రామ కథలు, రాముని విశేషాలు కూడా ! అద్భుతమైన రాముని ఆలయ విశేషాలు మనకి వెంటనే అయోధ్యకి వెళ్లి ఆ భవ్య, దివ్య రాముని చూడాలనే కోరికని రేకెత్తిస్తాయి.  ఆ వరాన్ని సాకేతరాముడు అనుగ్రహించాలని, ఆ స్వామీ రక్ష ఈ జగతికి మెండుగా లభించాలని కోరుకుంటూ , శలవు . నమస్కారం .  

 

 

 

Lord Rama, Ayodhya, Rama Mandir, Ramjanmabhoomi, Rama Janmbabhumi, Ayodhya Ram,

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore